[t4b-ticker]

ఘోర విషాదం.. శ్రీశైలంలో కుటుంబం ఆత్మహత్య

ప్రతిపక్షం, ఆగస్టు 25: శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్డెర సత్రంలోని ఓ గదిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కుటుంబ సభ్యులు ఈ నెల 20న శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో గది తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గది తీసుకున్న తర్వాత వరుసగా మూడు రోజుల పాటు బయటకు రాకపోవడంతో సత్రం సిబ్బందికి అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, హాల్‌లో ఇద్దరు పురుషులు మృతి చెందిన స్థితిలో కనిపించారు. దీంతో పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో బత్తలపల్లి, శ్రీశైలం ప్రాంతాల్లో విషాదం నెలకొంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News