[t4b-ticker]

2034 కాదు.. 2029లోనే జమిలి ఎన్నికలు? జేపీసీ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 25: దేశంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. జమిలి ఎన్నికలపై కమిటీ సంప్రదించిన వర్గాల్లో 99 శాతం మంది మద్దతు తెలిపినట్లు జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. దీంతో 2034 వరకు వేచి చూడకుండా 2029లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

వన్ నేషన్–వన్ ఎలక్షన్‌పై వివిధ వర్గాలు, నిపుణులు, రాజకీయ ప్రతినిధుల అభిప్రాయాలను జేపీసీ సేకరిస్తోంది. ఈ క్రమంలో కమిటీ సంప్రదించిన వారిలో అత్యధికులు జమిలి ఎన్నికలకు అనుకూలంగా స్పందించినట్లు పీపీ చౌదరి తెలిపారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలను ముందుగానే నిర్వహించే అవకాశాలపై పరిశీలన జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది.

ఇదే అంశంపై జరిగిన తాజా జేపీసీ సమావేశంలో పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, పి. చిదంబరం, తృణమూల్ కాంగ్రెస్ నేత సాగరికా ఘోష్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే తదితరులు సమావేశానికి హాజరై జమిలి ఎన్నికల ప్రతిపాదనపై తమ అభిప్రాయాలను కమిటీ ముందు ఉంచారు.

ప్రస్తుతం దేశంలో లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తరచూ ఎన్నికల ప్రక్రియ కొనసాగడం, భారీగా ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా బలగాలను వినియోగించాల్సి రావడం, ఎన్నికల ఖర్చులు పెరగడం వంటి అంశాలను జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నవారు ప్రస్తావిస్తున్నారు.

అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, పరిపాలనా పరమైన అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాలు, అసెంబ్లీల రద్దు, మధ్యంతర ఎన్నికలు వంటి అంశాలపై కూడా స్పష్టత అవసరం. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జేపీసీ తాజా వ్యాఖ్యలతో 2029లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అయితే 2029 ఎన్నికలపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనలు, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News