[t4b-ticker]

భారీగా పెరిగిన బియ్యం ధరలు

ప్రతిపక్షం, ఆగస్టు 26: తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. హెచ్‌ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా, జైశ్రీరామ్‌ వంటి ప్రముఖ రకాల బియ్యం ధరలు క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

గతంలో కిలో రూ.40 నుంచి రూ.50 మధ్య లభించిన పలు రకాల బియ్యం ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయమవుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు తగ్గుతుందన్న అంచనాలను కొందరు వ్యాపారులు ధరల పెంపునకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో బియ్యం లభ్యత తగ్గే అవకాశం ఉందనే ప్రచారంతో ముందుగానే నిల్వలు పెంచుకుంటున్నారని పేర్కొంటున్నారు.

వివిధ ప్రాంతాల్లో బియ్యం సరఫరా, డిమాండ్‌ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా నెలవారీ సరుకుల ఖర్చు మరింత పెరుగుతోందని వినియోగదారులు వాపోతున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెరుగుదలకు అసలు కారణాలను అధికారులు పరిశీలించి, అక్రమ నిల్వలు లేదా కృత్రిమ కొరతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News