ప్రతిపక్షం, ఆగస్టు 26: 2027 జనాభా లెక్కల్లో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఫార్మాట్’ విధానంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానంతో కులాల వివరాలు కచ్చితంగా నమోదు కాకపోవచ్చని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కుల వివరాల సేకరణకు ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్‌ను తక్షణమే రద్దు చేసి, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం సమర్థవంతమైన విధానాన్ని రూపొందించాలని కోరారు.
ఓపెన్ ఫార్మాట్‌లో ప్రజలు తమ కులాన్ని ఏ పేరుతో చెబితే, అదే వివరాలను నమోదు చేసే విధానం ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా కులాల పేర్లు, ఉపకులాలు, ప్రాంతీయ పేర్లలో ఉన్న వ్యత్యాసాల కారణంగా గణాంకాల్లో స్పష్టత లోపించే అవకాశం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.
కులగణన ద్వారా సేకరించే వివరాలు భవిష్యత్‌లో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలకు కీలకంగా మారే అవకాశం ఉన్నందున డేటా అత్యంత కచ్చితంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
కులాల వివరాల సేకరణకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు సామాజిక రంగ నిపుణులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చించాలని ఖర్గే, రాహుల్ గాంధీ సూచించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల వివరాలను నమోదు చేసే విధానాన్ని రూపొందించాలని కోరారు.
2027 జనాభా లెక్కల్లో కుల వివరాల నమోదు అంశం ఇప్పటికే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ తాజా అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారాయి.





























