ప్రతిపక్షం, ఆగస్టు 28: దేశంలో ప్రస్తుత ఎన్డీయే పాలనలో అవినీతి పెరిగిందని 43 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు ‘సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే వెల్లడించింది. మరో 34.8 శాతం మంది మాత్రం అవినీతి తగ్గిందని భావిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగమే అతిపెద్ద సమస్యగా కొనసాగుతోందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడినట్లు తెలిపింది. అదే సమయంలో ధరల పెరుగుదలను ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాన వైఫల్యంగా ఎక్కువ మంది పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహించినా ఎన్డీయే కూటమికే మరోసారి ప్రజల మద్దతు లభించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. దీంతో ఒకవైపు అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. మరోవైపు ఎన్నికల పరంగా ఎన్డీయేకు ఉన్న మద్దతు కొనసాగుతున్నట్లు ఈ సర్వే సూచిస్తోంది.





























