ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 28: చండూరు మండలం కస్తాల గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఒక వానరం వీధి కుక్కల దాడిలో మృతి చెందింది.విషయాన్ని గమనించిన గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకున్నారు. వానరాన్ని ఆంజనేయ స్వామి రూపంగా భావించి హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వానరం మృతికి సంతాపం తెలిపారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ శివారులో ఆంజనేయస్వామి దేవాలయం భూమిలో గొయ్యి తీసి ఖననం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మూగజీవాల పట్ల కరుణ చూపాలని, వానరాలు గ్రామానికి వచ్చినప్పుడు హాని తలపెట్టవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

































