ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే పండుగగా రాఖీ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ఈ సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కుటుంబాలతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ, వారికి వివిధ రంగాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మహిళలకు ఆర్థిక అవకాశాలు పెంచడం, వారి ఆదాయాన్ని పెంచడం, కుటుంబ స్థాయిలో ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు అండగా నిలవాలని, మహిళల అభివృద్ధి, సాధికారతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణలోని ప్రతి కుటుంబంలో సంతోషం, సోదరభావం, పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరియాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.





























