ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: తెలంగాణలో పోలీసుల వ్యవహారశైలిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు తమ సమస్యలను ప్రశ్నించినా, నిరసనలు తెలిపినా కేసులు, అరెస్టులతో అణచివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మహబూబాబాద్‌లో విద్యార్థిపై దాడి ఘటన, నాగర్‌కర్నూల్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణలు, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు, నిరసనల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హరీశ్‌రావు తప్పుబట్టారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులు.. ప్రశ్నించే గొంతులను అణచివేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం ప్రజాపాలనకు నిదర్శనం కాదని అన్నారు. తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉండాలని స్పష్టం చేశారు.
పోలీసుల తీరుపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. దౌర్జన్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని హరీశ్‌రావు కోరారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలను పాలించాల్సింది ప్రజాస్వామ్య ప్రభుత్వమే తప్ప.. పోలీసుల భయంతో పాలన సాగించే పరిస్థితి ఉండకూడదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు.





























