[t4b-ticker]

అనుమతులున్నా కూల్చేశారు..!

•ఏసీబీకి పట్టించినందుకే కక్ష్య సాధింపు?

•జిల్లా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులపై సాంభశివ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని తీవ్ర ఆరోపణలు

•జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినందుకే టార్గెట్ చేశారంటూ ఆవేదన

•వనపర్తి జిల్లా అధికారులపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరిక

వనపర్తి ప్రతినిధి , ఆగస్టు 30(ప్రతిపక్షం): వనపర్తి జిల్లాలో రైస్ మిల్లుల కూల్చివేత వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. కొత్తకోట మండలం విలియంకొండ గ్రామ శివారులోని సాంభశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్ష్యపూరితంగా కూల్చివేశారని ఆ సంస్థ యజమాని రమావత్ సమన్ నాయక్ ఆరోపించారు.సివిల్ సప్లై అధికారుల అవినీతి, వేధింపులపై తాను ఏసీబీని ఆశ్రయించడం, అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే తనపై అధికారుల కక్ష్యకు కారణమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

అన్ని అనుమతులున్నా కూల్చివేతేనా?

తన రైస్ మిల్లుకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని సమన్ నాయక్ తెలిపారు.నాలా కన్వర్షన్ ఆర్డర్, డీటీసీపీ అనుమతి, ఫ్యాక్టరీస్ శాఖ అనుమతి, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, జీఎస్టీ రిజిస్ట్రేషన్, విద్యుత్ ఒప్పందం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి, సివిల్ సప్లైస్ శాఖ ఎన్ఓసీ తదితర పత్రాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.ఇన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఏ ప్రాతిపదికన జేసీబీలతో రైస్ మిల్లును కూల్చివేశారో అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఇతర మిల్లుల పరిస్థితిపై ఒకలా, తన మిల్లుపై మరోలా వ్యవహరించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

ఏసీబీకి పట్టించినందుకే టార్గెట్ చేశారా?

2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ వడ్ల కేటాయింపు విషయంలో అప్పటి సివిల్ సప్లై డీఎం తనను తీవ్రంగా వేధించారని సమన్ నాయక్ ఆరోపించారు. రూ.లక్ష ఇస్తేనే వడ్లు కేటాయిస్తానంటూ డిమాండ్ చేశారని, దీంతో తాను ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వలపన్ని సదరు అధికారిని పట్టుకున్నారని తెలిపారు.అప్పటి నుంచి తనపై అధికారుల్లో వ్యతిరేకత మొదలైందని ఆరోపించారు.ఇదే సమయంలో సివిల్ సప్లై అధికారుల వేధింపులపై జూన్ 17, 2026న జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, దీనిపై కమిషన్ స్పందించి రాష్ట్ర సివిల్ సప్లై అధికారులకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

కమిషన్ ఫిర్యాదే కక్ష్యకు కారణమా?

జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే తనపై ఒత్తిడి, వేధింపులు మరింత పెరిగాయని సమన్ నాయక్ ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు.సివిల్ సప్లై అధికారులు వడ్లు కేటాయించినప్పటికీ అనంతరం చిన్నచిన్న కారణాలను చూపుతూ తన రైస్ మిల్లుపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. చివరకు అన్ని అనుమతులు ఉన్న సంస్థను జేసీబీలతో కూల్చివేయడం తనకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంఆర్ బకాయిలున్న మిల్లులపై చర్యలేవి?

జిల్లాలో సీఎంఆర్ బకాయిలు ఇతర రైస్ మిల్లుల వద్ద కూడా ఉన్నాయని, అయితే అందరిపై ఒకే విధంగా చర్యలు తీసుకున్నారా? అని సమన్ నాయక్ ప్రశ్నించారు. కొందరిపై ఉత్తుత్తి చర్యలు తీసుకుంటూ తనపై మాత్రం కఠినంగా వ్యవహరించారని ఆరోపించారు.రైస్ మిల్లుల వ్యవహారంలో అధికారులు, మిల్లర్ల మధ్య జరిగిన లావాదేవీలు, సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు, బకాయిల అంశాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు.

న్యాయపోరాటం చేస్తా..

తన రైస్ మిల్లు కూల్చివేత వెనుక ఉన్న పరిణామాలపై పూర్తి స్థాయిలో న్యాయపోరాటం చేస్తానని రమావత్ సమన్ నాయక్ స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతి పత్రాలు, అధికారుల చర్యలకు సంబంధించిన వివరాలను న్యాయస్థానాల ముందు ఉంచుతానని తెలిపారు.

Spread the love

Related News

Latest News