[t4b-ticker]

ప్రభుత్వ ఉద్యోగిని కుమార్తెకు కళ్యాణలక్ష్మి మంజూరు?

ప్రతిపక్షం, ఆగస్టు 30: హనుమకొండ జిల్లాలోని కాజీపేట సోమిడి శివారులో ఉన్న తెలంగాణ గురుకుల మహిళా విద్యాసంస్థలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని తన కుమార్తె వివాహం అనంతరం కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ దరఖాస్తులో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.98 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ దరఖాస్తు పరిశీలనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పటికీ కళ్యాణలక్ష్మి పథకానికి ఆమె ఎలా దరఖాస్తు చేసుకున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా దరఖాస్తులో పేర్కొన్న పేరు ప్రభుత్వ రికార్డుల్లో లేకపోయినప్పటికీ, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ తహశీల్దార్‌ పరిధిలోని అధికారుల ద్వారా పథకం మంజూరైనట్లు సమాచారం.

ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ వివరాలు అధికారిక రికార్డుల్లో నమోదై ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ వార్షిక ఆదాయం కేవలం రూ.1.98 లక్షలుగా చూపిస్తూ పథకానికి దరఖాస్తు చేయడం, ఆ దరఖాస్తు ఎలా ఆమోదం పొందిందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తు సమయంలో సమర్పించిన పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ వివరాలు, అధికారుల పరిశీలన ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణలక్ష్మి పథకానికి అర్హత లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారా? ఒకవేళ అర్హత లేకపోతే దరఖాస్తును ఎవరు పరిశీలించారు? ప్రభుత్వ రికార్డుల్లో లేని పేరుతో పథకం ఎలా మంజూరైంది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు మాత్రమే అందేలా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, దరఖాస్తులో పేర్కొన్న ఆదాయ వివరాలు, అర్హత, మంజూరు ప్రక్రియను పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love

Related News

Latest News