[t4b-ticker]

తెలంగాణలో గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

ప్రతిపక్షం, ఆగస్టు 30: తెలంగాణలో గోదావరి పుష్కరాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంట పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి గుర్తుకొచ్చేదని, ఇకపై తెలంగాణలోనూ పుష్కరాల వైభవాన్ని ఘనంగా చాటేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రజాభవన్‌లో పుష్కరాల ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఉన్న ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కొండా సురేఖ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అభివృద్ధి చేసేలా పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని, మరికొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు.

తెలంగాణలో గోదావరి పుష్కరాలను భక్తులకు చిరస్మరణీయంగా నిలిచేలా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News