ప్రతిపక్షం, సెప్టెంబర్ 01, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఆమె ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో సురేఖ హస్తినకు వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.
కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్‌ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై అధిష్ఠానం నేతలతో చర్చలు జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించినట్లు వచ్చిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై అధిష్ఠానం నుంచి ఆమెకు ఏవైనా సూచనలు అందుతాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలు, పార్టీ వ్యవహారాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సురేఖతో భేటీ అనంతరం అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.





























