ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆయనతో భేటీ అయ్యారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు, అధిష్ఠానం సూచనలు వంటి అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ అంతర్గత అంశాలపై అధిష్ఠానంతో చర్చలు జరుగుతున్న సమయంలో మహేశ్ గౌడ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
నిన్న కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి దాదాపు గంటపాటు సమావేశమైనట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన, మంత్రివర్గంలో మార్పులు, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీకి సంబంధించిన పలు అంశాలతో పాటు కొండా సురేఖ వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధిష్ఠానం నుంచి వచ్చిన సూచనలు, తదుపరి కార్యాచరణపై కూడా చర్చించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ వరుసగా అధిష్ఠానం పెద్దలను కలవనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో కాసేపట్లో సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలు, నిన్నటి పరిణామాలపై ఆమెతో చర్చించే అవకాశం ఉంది.
అనంతరం ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మహేశ్ గౌడ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక అంశాలను ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల వివరాలను కూడా వేణుగోపాల్‌కు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరగడంతో పాటు పార్టీ అగ్రనేతలు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ గౌడ్‌తో జరిగే సమావేశాల్లో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ భేటీ.. అనంతరం మీనాక్షీ నటరాజన్, కేసీ వేణుగోపాల్‌తో మహేశ్ గౌడ్ సమావేశాలు జరగనుండటంతో తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వరుస భేటీల అనంతరం పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి నిర్ణయాలు లేదా సూచనలు వెలువడతాయన్నది ఆసక్తికరంగా మారింది.





























