మెదక్ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఆరోపణలు..?
విజిలెన్స్ తనిఖీలతో వెలుగులోకి వస్తున్న అక్రమాలు..
దాడులు ఆపించేందుకు తెరవెనుక మంతనాలంటూ ప్రచారం
కోట్ల విలువైన బియ్యం వ్యవహారంలో చర్యలు తీసుకోవద్దంటూ ఒత్తిళ్లు?
ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు
కోట్ల రూపాయలు ఇగగొట్టేందుకు కుట్రలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 03: ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు అప్పగించాల్సిన బియ్యం విషయంలో మెదక్ జిల్లాలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం అప్పగింతలో జాప్యం, నిల్వల వ్యత్యాసాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని మిల్లుల్లో జరిగిన తనిఖీల్లో అనుమానాస్పద అంశాలు బయటపడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
విజిలెన్స్ నిఘాతో మిల్లర్లలో గుబులు
ప్రభుత్వ బియ్యం వ్యవహారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. మిల్లుల్లో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించిన సీఎంఆర్ బియ్యం వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిల్వలు, రికార్డుల మధ్య వ్యత్యాసాలు ఉంటే వాటిపై అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంది.విజిలెన్స్ తనిఖీలతో అసలు లెక్కలు బయటపడతాయన్న ఆందోళన కొందరు మిల్లర్లలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. దీంతో తనిఖీలను నిలిపివేయించేందుకు రైస్ మిల్లర్ల యూనియన్ నాయకులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతలతో మంతనాలా?
విజిలెన్స్ దాడులు, తనిఖీలను నిలిపివేయించేందుకు రైస్ మిల్లర్ల యూనియన్ నాయకులు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులను ఆశ్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు. నిజానిజాలు తేలాలంటే విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల పూర్తి వివరాలు, మిల్లుల రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యం పరిమాణం, వాస్తవంగా అప్పగించిన బియ్యం వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.
కోట్ల విలువైన బియ్యం.. లెక్క తేలేదెప్పుడు?
ప్రభుత్వానికి చెందాల్సిన బియ్యం విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగితే అది నేరుగా ప్రభుత్వ ఖజానాపై భారం పడటమే కాకుండా ప్రజాధనానికి నష్టం కలిగించే అవకాశం ఉంది. కోట్ల రూపాయల విలువైన బియ్యం విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రతి మిల్లులోనూ సమగ్ర తనిఖీలు నిర్వహించి, ధాన్యం కేటాయింపు నుంచి బియ్యం అప్పగింత వరకు మొత్తం ప్రక్రియను ఆడిట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
‘చర్యలు వద్దు’ అనే ఒత్తిళ్లు ఎందుకు?
అక్రమాలు బయటపడితే సంబంధిత మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు రైస్ మిల్లర్ల యూనియన్ నాయకులు చర్యలు తీసుకోకుండా అధికారులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు అక్రమాలు జరగలేదంటే తనిఖీలకు, విచారణకు ఎందుకు భయపడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.విజిలెన్స్ విచారణ పూర్తయితేనే అసలు లెక్కలు తేలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఎంత? మిల్లుల్లో ఉన్న నిల్వలు ఎంత? రికార్డుల్లో చూపుతున్నది ఎంత? వాస్తవంగా ప్రభుత్వానికి చేరింది ఎంత? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిగితేనే కోట్ల విలువైన బియ్యం వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అధికారులు ఏం చేస్తారు?
రైస్ మిల్లులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి, రికార్డులు–భౌతిక నిల్వలను సరిపోల్చాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులైన మిల్లర్లు, వారికి సహకరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్ల వాదనను కూడా అధికారికంగా నమోదు చేసి ప్రజల ముందుంచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎగ్గొట్టేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.






























