- రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ యువ సమరభేరి సభ
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 05: కరీంనగర్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ‘యువ సమరభేరి’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాహుల్ గాంధీ.. ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు?” అంటూ నిలదీశారు. మోచేతికి బెల్లం పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడంలో కేవలం ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదని, రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు అడిగితే యువతపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని, నోటిఫికేషన్లు పోయి ‘లూటిఫికేషన్లు’ బ్రహ్మాండంగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి రావడానికి ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతకాని పాలనతో ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ భారీ బహిరంగ సభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.





























