[t4b-ticker]

​ఆపదలో ఉన్న అప్పలయ చెరువు సర్పంచి కుటుంబానికి అండ

మానవత్వం చాటుకున్న నంగునూరు మండల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు

రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేత

​బ్రెయిన్ స్టోక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలాయచెరువు సర్పంచ్ పెద్దమ్మల సత్యం

ప్రతిపక్షం, ​నంగునూరు, సెప్టెంబర్ 16: అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచి కుటుంబానికి నంగునూరు మండల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామ సర్పంచి పెద్దమ్మల సత్యం ఇటీవల తీవ్ర బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ లో చేర్పించారు. ఇరవై రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు సత్యం కుటుంబానికి భారం కావడంతో విషయం తెలుసుకున్న నంగునూరు మండల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. ​సత్యం కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు చొరవ తీసుకుని సుమారు రూ. 2.50 లక్షల నిధులను సేకరించారు.

బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం నంగునూరు మండల అధ్యక్షుడు రేకులపల్లి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు బుధవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలాయ చెరువు సర్పంచి సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ. 2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. సత్యం త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఆరోగ్యంతో తమ ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News