ప్రతిపక్షం, ఆగస్టు 26:, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భూముల చుట్టూనే పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే భూములను కబ్జా చేసే స్థాయికి పరిస్థితి చేరిందని మండిపడ్డారు.
కూకట్‌పల్లిలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల వ్యవహారాలకు ప్రాధాన్యం పెరిగిందని ఆరోపించారు. ప్రజలకు చెందిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల వాటి యజమానులు రిజిస్ట్రేషన్లు, విక్రయాలు, ఇతర లావాదేవీల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పార్కులు, ప్లాట్లు సహా ప్రభుత్వ ఆధీనంలోని విలువైన స్థలాలను కూడా ప్రభుత్వం వదలకుండా విక్రయిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు బదులుగా వాటిని అమ్మే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు.
అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పేదలకు కేటాయించిన భూములను సైతం లాక్కొని అధికార పార్టీకి చెందిన అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం విక్రయించిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని విక్రయించడం సరికాదని అన్నారు. భూముల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల ముందు ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.





























