Trending Now

‘వచ్చే భక్తులందరికి సౌకర్యాలు కల్పిస్తాం’.. మేడారం జాతరపై మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్ష

మేడారం జాతరకు పొటెత్తుతున్న భక్తులు..

ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలి..

2 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనా..

బంగారం, టెంకాయల వ్యాపారుల దోపిడీ..

ప్రతిపక్షం, మేడారం ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతరకు వచ్చే భక్తులందరికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు తెలిపారు. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సీతక్క తెలిపారు. ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. జాతరకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో సమ్మక్క, సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ దృష్యా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రద్దీ దృష్ట్యా ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులను నియమించినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఈ మహాజాతర వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్‌ కేటాయిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు రావడం ఇదే తొలిసారని వెల్లడించారు. రెండు నెలల నుంచి అధికారులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. భక్తులు క్రమశిక్షణతో రావాలని సూచించారు.

ములుగు వరకే వీఐపీ వాహనాల అనుమతి..

వీఐపీలు వాహనాలు ములుగులోనే ఉంచి బస్సుల్లో మేడారానికి రావాలని మంత్రి సీతక్క సూచించారు. భక్తులకు ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. జాతర కోసం ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయి ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. తల్లుల చరిత్రను శిలాశాసనం చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం. ఈ జాతరకు ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో బస్సుల్లో ప్రయాణించారు. అదనంగా బస్సులు ఏర్పాటు చేశాం. ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులను మేడారంలో ఉంచాం.సమ్మక్క – సారలమ్మ జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులను నియమించాం. జాతరకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తారని దీనికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి- పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. అంతకు ముందు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సమక్క, సారలక్కలను దర్శించుకున్నారు. పూజారులు వారికి ఘనస్వాగతం పలికి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

బంగారం, టెంకాయల వ్యాపారుల దోపిడీ..

జాతరకు వచ్చే భక్తులను టెంకాలయలు, బంగారు (బెల్లం) వ్యాపారులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. బెల్లం కిలో రూ.80 నుంచి 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే టెంకాయలను ఒక్కొక్కటి రూ.50కి విక్రయిస్తున్నారు. ఇదేంటీ అని భక్తులు ప్రశ్నిస్తే లక్షలు పెట్టి టెంటర్​ తీసుకున్నామని, ఇది అంతే నంటూ సమాధానం ఇస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు టెండర్ల నిర్వహణలో నిర్ణయించిన ధరలను ఏ దుకాణం వద్ద కూడా ప్రదర్శించడంలేదు. వ్యాపారుల దోపిడీ గురించి పలువురు భక్తులు మంత్రుల దృష్ఠికి తీసుకెళ్లగా, పరిశీలిస్తామంటూ సమాధానం ఇవ్వడం కొసమెరుపు.

Spread the love

Related News