ప్రతిపక్షం, హైదరాబాద్, ఫిబ్రవరి 11:
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం వెలువడిన ఉత్తర్వులలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అదనపు బాధ్యతల్లో ఉన్న కృష్ణభాస్కర్ ను ప్రభుత్వం తప్పించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సబ్యసాచి ఘోష్ ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ గా, కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయినీ దేవిని బదిలీ చేస్తూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీఆర్ఏసీ) డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దివ్య దేవరాన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మయాంక్ మిట్టల్ ను జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ శర్మను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వలు జారీ చేశారు.
అలాగే జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ ఎస్ పంకజ ను మల్కాజిగిరి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఈడీ గా వెయిటింగ్ లో ఉన్న సామ్రాట్ అశోక్ ను నియమించింది. సైబరాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఈడీ గా రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న ఎం. సంతోష్ ను నియమించింది. ఉపాధి శిక్షణ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కె. శశికిరణ్ చారిని లోక్ భవన్ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది.




























