గ్రామీణ కథల మహా దర్శకుడు ఇకలేరు.. దర్శక ఇమయం భారతీరాజా కన్నుమూత

ప్రతిపక్షం, జూన్ 10: తమిళ సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామీణ కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన భారతీరాజా, భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, 1977లో విడుదలైన “16 వయతినిలే” చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. ఆ కాలంలో నగర నేపథ్య కథలే ఎక్కువగా వస్తున్న సమయంలో, గ్రామీణ జీవన విధానాన్ని అత్యంత సహజంగా చూపించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా “దర్శక ఇమయం” అని పిలిచేవారు.

తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో సిగప్పు రోజక్కల్, కిజక్కే పోగుం రైల్, అలైగల్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలను రూపొందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

తెలుగు సినీ రంగంతోనూ భారతీరాజాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకుంది. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

భారతీరాజా కేవలం దర్శకుడిగానే కాకుండా, అనేకమంది నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువుగా కూడా గుర్తింపు పొందారు. రాధా, రాధికా, రేవతి, కార్తీక్ వంటి పలువురు ప్రముఖ కళాకారులు ఆయన సినిమాల ద్వారానే సినీ రంగంలో అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను వెలికితీయడంలో ఆయనకు ప్రత్యేకమైన పేరు ఉంది.

తన సినీ సేవలకు గుర్తింపుగా ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను 2004లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఇటీవలి కాలంలో నటుడిగానూ తన ప్రతిభను చాటుకున్న భారతీరాజా, పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తనదైన కథనం, సహజత్వం, గ్రామీణ సంస్కృతిని వెండితెరపై ఆవిష్కరించిన ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది.

Spread the love

Related News

Latest News