ప్రతిపక్షం, జూన్ 24: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టులో కొత్త గేట్ల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొననున్నారు.
గత ఏడాది ఆగస్టులో భారీ వరదల కారణంగా ప్రాజెక్టు 19వ గేటు దెబ్బతినడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనంతరం నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని గేట్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో మొత్తం 33 గేట్లను ఆధునిక సాంకేతికతతో పునర్నిర్మించారు. ఇందుకోసం సుమారు రూ.51 కోట్ల వ్యయం చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త గేట్లతో ప్రాజెక్టు భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు నీటి నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

















