తుంగభద్రకు కొత్త ఊపు.. 33 క్రస్ట్ గేట్లను ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర నేతలు

ప్రతిపక్షం, జూన్ 25: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను ఘనంగా ప్రారంభించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్లలో 17వ గేటును కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గత ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో ప్రాజెక్టు భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనంతరం నిపుణుల కమిటీ సూచనల మేరకు సుమారు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేశారు.

ఈ గేట్ల పునరుద్ధరణతో తుంగభద్ర జలాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది. అలాగే సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా, ఆనకట్ట భద్రత అంశాల్లో కీలకమైన మెరుగుదలలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడిగా నిలుస్తున్న నేపథ్యంలో కొత్త గేట్ల ప్రారంభం జలవనరుల పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం అంతర్రాష్ట్ర సహకారానికి నిదర్శనంగా నిలిచింది.

Spread the love

Related News

Latest News