ప్రతిపక్షం, జూలై 20: ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. మే 15 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,344 ఎబోలా కేసులు నమోదైనట్లు కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 930 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఒక్క 24 గంటల వ్యవధిలోనే 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
పరిస్థితిని నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాధితులకు చికిత్స అందించడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

















