ప్రతిపక్షం, జూలై 22: 2025లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన హైదరాబాద్కు చెందిన రెహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పర్మినెంట్ రెసిడెన్సీ) మంజూరు చేసింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పలువురి ప్రాణాలను కాపాడిన ఆయన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
కాల్పులు జరుగుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, భయపడకుండా గాయపడిన బాధితుల సహాయానికి ముందుకొచ్చారు. రక్తపు మడుగుల్లో పడివున్న సుమారు 18 నుంచి 20 మందిని ఒక్కొక్కరిని అంబులెన్సుల వరకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో పలువురికి సకాలంలో వైద్యసాయం అందడంతో విలువైన ప్రాణాలు నిలిచాయి.
రెహ్మత్ పాషా చూపిన మానవత్వం, సేవాభావం, అపూర్వ ధైర్యాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాస హోదాను కల్పించింది. ఈ నిర్ణయంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆస్ట్రేలియాలో స్థిరపడే అవకాశం లభించింది. త్వరలోనే ఆయన భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన రెహ్మత్ పాషా సేవలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గర్వకారణంగా మారింది. ప్రాణాలకు తెగించి ఇతరులను రక్షించిన ఆయన మానవత్వానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చిన ఈ గౌరవం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

















