ప్రతిపక్షం, జూలై 27: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో కిడ్నాప్‌కు గురైన భారత సంతతికి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ధీరూ రమణి (75) ఎట్టకేలకు సురక్షితంగా విడుదలైనట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన్ను గుర్తుతెలియని సాయుధ దుండగులు అపహరించగా, విడుదల కోసం భారీ మొత్తంలో విమోచన ధనం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
సమాచారం ప్రకారం, తొలుత కిడ్నాపర్లు రూ.100 కోట్లకు పైగా విమోచన ధనం కోరారు. అనంతరం కుటుంబ సభ్యులు, మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల తర్వాత సుమారు రూ.44 కోట్ల చెల్లింపుతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని అందుకున్న తర్వాత ధీరూ రమణిని దుండగులు విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
విడుదల అనంతరం ధీరూ రమణిని స్థానిక భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆయనను అపహరించిన వ్యక్తులు, వారి ఉద్దేశాలు, ఈ ఘటన వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ధీరూ రమణి గత కొన్నేళ్లుగా మాలిలో గోల్డ్ మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఖనిజ సంపద అధికంగా ఉన్నప్పటికీ, మాలిలో ఉగ్రవాద సంస్థలు, సాయుధ ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో విదేశీ వ్యాపారులు తరచూ కిడ్నాప్‌లకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఘటనతో మరోసారి మాలిలో విదేశీ వ్యాపారుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారి సురక్షితంగా విడుదల కావడం కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చినప్పటికీ, కిడ్నాప్ వెనుక ఉన్న నేరస్థులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు స్థానిక అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

















