ప్రతిపక్షం, జూలై 30: తాతయ్య ఆరోగ్యం కోసం ఓ యువకుడు రూపొందించిన కృత్రిమ మేధ (AI) ఆధారిత యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. చైనాకు చెందిన 18 ఏళ్ల మాకై తన తాత మందులు సమయానికి తీసుకోవడం మర్చిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ యాప్ను అభివృద్ధి చేశాడు.
మాకై చదువు నిమిత్తం వేరే నగరంలో ఉండటంతో, ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తాత ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవాడు. ఆ సమస్యకు సాంకేతిక పరిష్కారంగా AI టెక్నాలజీతో వినూత్న యాప్ను రూపొందించాడు.
ఈ యాప్ నిర్ణయించిన సమయానికి మందులు తీసుకోవాలని రిమైండర్లు ఇవ్వడమే కాకుండా, గడువు ముగిసిన (Expired) మందులను ఫొటో ద్వారా గుర్తించి వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో వృద్ధులు పొరపాటున గడువు ముగిసిన మందులు వాడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
తాతయ్యపై ప్రేమతో రూపొందించిన ఈ యాప్ కథ నెట్టింట వైరల్గా మారింది. సాంకేతికతను మానవ అవసరాలకు అనుగుణంగా వినియోగించిన మాకైపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇలాంటి ఆవిష్కరణలే నిజమైన టెక్నాలజీ విజయాలు”, “తాతపై ప్రేమకు ఇదే నిదర్శనం” అంటూ సోషల్ మీడియాలో అతడిని అభినందిస్తున్నారు.
















