ప్రతిపక్షం, ఆగస్టు 21: గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇ-కామర్స్ వేదిక ద్వారా నిషేధిత సల్ఫస్ మాత్రలను కొనుగోలు చేసిన 17 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. టిక్లీ ప్రాంతానికి చెందిన యువీ అనే బాలుడు ఏప్రిల్ 28న ప్రాణాలు కోల్పోయాడు.
బాలుడి మృతిపై అనుమానం వచ్చిన తల్లి అనురాధ అతడి ఫోన్‌ను పరిశీలించగా, ఆన్‌లైన్‌లో సల్ఫస్ మాత్రలను కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆమె ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా నిషేధిత పదార్థాల విక్రయానికి సంబంధించి ఇ-కామర్స్ వేదికపై నిర్లక్ష్య ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు సంబంధిత సంస్థపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆన్‌లైన్ వేదికలపై నిషేధిత, ప్రమాదకర పదార్థాలు అందుబాటులోకి రావడంపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మైనర్లు ఇలాంటి ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయకుండా కఠినమైన నియంత్రణలు, వయసు నిర్ధారణ చర్యలు అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





























