[t4b-ticker]

కొండా సురేఖపై వేటు తప్పదా?.. కాంగ్రెస్‌లో ముదిరిన అసమ్మతి

ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుస్మిత వ్యాఖ్యలను సురేఖ బహిరంగంగా ఖండించకపోవడాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ క్రమశిక్షణ, కొండా సురేఖ వ్యవహారంపై వారు చర్చించినట్లు సమాచారం. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట వేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సురేఖపై నిజంగానే చర్యలు తీసుకుంటారా? లేక వివరణతోనే వ్యవహారాన్ని ముగిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News