ప్రతిపక్షం, ఆగస్టు 23, హైదరాబాద్: ప్రేమికురాలిని భయపెట్టేందుకు ఓ యువకుడు సరదాగా పంపిన కిడ్నాప్ ప్రాంక్ మెసేజ్ చివరకు పోలీసులకు రూ.30 లక్షల నగదును పట్టుకునేలా చేసింది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముగ్గురు యువకులు ఓ ఫ్లాట్‌లో విందు చేసుకుంటుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ యువకుడు తన ప్రియురాలికి కిడ్నాప్ చేసినట్లు భావించేలా ప్రాంక్ మెసేజ్ పంపించాడు. దీంతో ఆ యువతి ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించి అనుమానిత యువకులు ఉన్న ఫ్లాట్‌కు చేరుకున్నారు.
ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఓ సూట్‌కేసులో భారీగా నగదు కనిపించింది. అందులో రూ.30 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించిన వివరాలు, దాని మూలానికి సంబంధించి యువకులు సరైన ఆధారాలు చూపించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అనుమానం మరింత బలపడటంతో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో భాగంగా వారి మొబైల్ ఫోన్లను పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వ్యవహారం బయటపడినట్లు సమాచారం. నగదుకు బెట్టింగ్‌తో ఏమైనా సంబంధం ఉందా? హవాలా మార్గంలో నగదు తరలించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమికురాలికి పంపిన ఓ ప్రాంక్ మెసేజ్ కారణంగా మొదట పోలీసులు కిడ్నాప్ వ్యవహారంపై దృష్టి సారించగా.. ఫ్లాట్‌లో రూ.30 లక్షల నగదు బయటపడటంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి ఇవ్వాల్సి ఉంది? బెట్టింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోన్లలో లభించిన సమాచారంతో క్రికెట్ బెట్టింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.





























