ప్రతిపక్షం, ఆగస్టు 30: టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించగా.. బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్‌బీకే 111’ కూడా అదే తేదీన థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
నాగార్జున ‘కింగ్ 100’పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆయన నటిస్తున్న ‘ఎన్‌బీకే 111’పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే సంక్రాంతి తరహాలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ కనిపించే అవకాశం ఉంది.
బాలకృష్ణ, నాగార్జున గతంలోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 1996 జనవరిలో బాలయ్య నటించిన ‘వంశానికొక్కడు’, నాగార్జున నటించిన ‘వజ్రం’ సినిమాలు దాదాపు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకే విడుదల తేదీకి రావడం అరుదుగానే జరిగింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.
ఒకవైపు బాలకృష్ణ మాస్ ఇమేజ్, మరోవైపు నాగార్జునకు ఉన్న క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీగా అభిమానులు ఉండటంతో థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్ కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటి నుంచే చర్చ సాగుతోంది.
అయితే రెండు సినిమాలు ఒకే తేదీన విడుదలవుతాయన్న వార్తకు సంబంధించి ‘ఎన్‌బీకే 111’ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విడుదల తేదీపై స్పష్టత వచ్చిన తర్వాతే అసలు పోటీ ఉంటుందా లేదా అన్నది తేలనుంది. ఒకవేళ డిసెంబర్ 24న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలయ్య, నాగ్ మధ్య మరోసారి ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరును చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు.





























