[t4b-ticker]

సీఎం రేవంత్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఏదైనా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మీడియాతో అనధికారికంగా మాట్లాడిన సందర్భంగా తనపై జరుగుతున్న చర్చ, పార్టీ అధిష్ఠానం నిర్ణయం తదితర అంశాలపై ఆమె స్పందించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పుకోవడం వల్ల మంత్రులు, కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి నెలకొందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. నాయకత్వం విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలోని పలువురు నేతల్లో అసహనానికి కారణమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కూడా పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా చెప్పలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకునే అంశంపై పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ.. తనకు మాత్రం ఎవరూ రాజీనామా చేయాలని సూచించలేదని తెలిపారు. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

తనపై వచ్చిన వివాదానికి సంబంధించి ఇప్పటికే తన వివరణ ఇచ్చానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం తన వివరణను, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాల్లో తన వైఖరిని అధిష్ఠానం ముందు స్పష్టంగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సామాజిక న్యాయం అంశాన్ని కూడా కొండా సురేఖ ప్రస్తావించారు. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా నేతపై ఒక విధంగా, ఇతర వర్గాలకు చెందిన నేతల విషయంలో మరో విధంగా న్యాయం చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. అన్ని వర్గాలకు ఒకే విధమైన న్యాయం, సమానమైన ప్రమాణాలు ఉండాలని ఆమె వ్యాఖ్యల ద్వారా సూచించారు.

కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఆమె నేరుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ, మరోవైపు సామాజిక సమీకరణాలు, రాష్ట్ర నాయకత్వంతో ఉన్న విభేదాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Spread the love

Related News

Latest News