[t4b-ticker]

సుస్మితకు మాట్లాడే హక్కుంది.. ఆమెను వద్దని చెప్పలేను: సురేఖ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: సుస్మిత వ్యాఖ్యల వివాదంపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. తనకు చెప్పాల్సిన విషయాలన్నీ ఖర్గేకు చెప్పానని పేర్కొన్నారు.

తన కుమార్తె సుస్మితకు స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని సురేఖ అన్నారు. ఆమెను ఏ అంశంపైనా మాట్లాడొద్దని తాను ఆదేశించలేనని చెప్పారు. సుస్మిత ఏ సందర్భంలో, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసిందనే విషయాన్ని కూడా పార్టీ అధిష్ఠానానికి వివరించినట్లు తెలిపారు.

తాను బీసీ మహిళనని, తనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం సముచితం కాదని సురేఖ అభిప్రాయపడ్డారు. తన సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. తాను పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారినని, తన భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారని చెప్పారు. ఈ రెండు వర్గాలకు కలిపి రాష్ట్రంలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉందని పేర్కొన్నారు.

తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని సురేఖ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తనను తప్పించాల్సిన అవసరం లేదని, తాను మంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.

సుస్మిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆమె అధిష్ఠానాన్ని కోరుతున్న నేపథ్యంలో.. పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News