జీవో 97ను రద్దు చేయాలని ఉద్యోగుల డిమాండ్
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఉద్యోగులు చేపట్టిన పోరాటానికి ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను శక్తి డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా పాలిటెక్నిక్ ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల బృందం సోమవారం ప్రొఫెసర్ హరగోపాల్‌ను కలిసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రతినిధులు ఆయనను కోరారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య ఉపయోగకరంగా ఉందని వివరించారు.పాలిటెక్నిక్ విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు తెలిపారు. అలాంటి విద్యాసంస్థలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఉద్యోగుల విజ్ఞప్తిపై ప్రొఫెసర్ హరగోపాల్ సానుకూలంగా స్పందించారు. వారి పోరాటానికి తన సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు.
గౌరవ సలహాదారుగా హరగోపాల్
తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీకి గౌరవ సలహాదారుగా వ్యవహరించాలని ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్‌ను కోరారు. ఉద్యమానికి సరైన దిశానిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు ప్రొఫెసర్ హరగోపాల్ అంగీకరించారు. జాయింట్ యాక్షన్ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉండేందుకు సమ్మతించారు. సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
విద్యా పరిరక్షణ కమిటీ మద్దతు
పాలిటెక్నిక్ ఉద్యోగుల పోరాటానికి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కూడా మద్దతు ప్రకటించింది. కమిటీ తరఫున ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు.పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించేందుకు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామిక శక్తులు మద్దతుగా నిలవాలని వారు కోరారు.
జీవో 97 రద్దు వరకు పోరాటం
జీవో 97ను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పాలిటెక్నిక్‌ల పరిరక్షణ కోసం పౌర సమాజం కూడా తమకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు నాగరాజు మంకాల (చైర్మన్), అభినవ్ బూరం (కో-చైర్మన్), ఆనంద్ పడవల(సలహాదారు), బి. నీరజ(ఆర్థిక కార్యదర్శి), మూర్తి సునీత (కో-చైర్మన్), ఉదయ శ్రీ(కార్యదర్శి), రాజ్ కుమార్ (కార్యదర్శి) పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యాసంస్థల భవిష్యత్తు, ఉద్యోగుల సమస్యలు, జీవో 97 రద్దు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.జీవో 97 రద్దు తమ ప్రధాన డిమాండ్ అని జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. డిమాండ్ నెరవేరే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది.






























