దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్ మండలం న్యూ వెల్మల్ బొప్పారం, నిర్మల్ గ్రామీణ మండలం రత్నపూర్ కాండ్లి లో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యం తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకు తెలియచేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు సేవలందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్ లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలను వలన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని భరోసా కల్పించారు. ప్రతి రైతు నుండి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1 లక్ష 2,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడ కూడా తరుగు వంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్రాలలో రైతులకు అవసరమైన త్రాగునీరు, టెంట్, క్లినింగ్ మిషన్, టార్పాలిన్లు, గన్ని బ్యాగ్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచామని అన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడం, రోజువారీ పురోగతిని సమావేశంలో చర్చించడం జరుగుతుందని కలెక్టర్ ప్రత్యక అధికారికి వివరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని నందిత, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎం శ్రీకళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఏడీ మార్కెటింగ్ అశ్వాక్, డీసీఓ నర్సయ్య, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీఓ గజానంద్, అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.