ప్రతిపక్షం, గజ్వేల్, మే 27: నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లోని కురుమ ఇళ్లలో చలికాలం వెచ్చగా, ఎండాకాలం చల్లగా, అడవుల్లో గొర్రెలు మేత మేసే సమయాన వర్షాకాలం తడవకుండా ఉండేందుకు పురుడు పోసుకున్న గొంగడి సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, వారి జీవితంలో అంతర్భాగంగా మారాయి. ఈ ప్రాంతంలో లభించే దక్కన్ జాతి గొర్రెల నుంచి మాత్రమే నలుపు, తెలుపు ఉన్ని లభ్యమవుతుంది. మహిళలు ఈ ఉన్నిని సంప్రదాయ పరికరాలు, ఏకుబద్ద, కదురు సాయంతో వడికి దారంగా మలిచి ఉండలుగా చుడతారు.
పురుషులు గొంగళ్లు మగ్గంపై నేసేందుకు ఏర్పాట్లు చేసి నేస్తారు. ప్రతి గొంగడికీ ప్రత్యేక అంచు (బార్డర్) ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా కొత్తగా ఎన్నో వాణిజ్యావసరాలు పుట్టుకురావడంతో కురుమలు వీటిని ఇప్పుడు పట్టణ వినియోగదారుల కోసం నేస్తున్నారు. యోగా మ్యాట్స్‌ను, తలకు చుట్టుకున్న మఫ్లర్గా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు సంప్రదాయ గొర్రెల పెంపకం తగ్గించి మాంసం ఎక్కువ ఇచ్చే జాతులను పెంచుతుండటం వల్ల ఉన్ని ఉత్పత్తి తగ్గిపోయింది’’ అని యునెస్కో విశ్లేషించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు- సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది. వాటిలో కురుమ గొంగడి ఒకటి.