[t4b-ticker]

రెడ్ అలర్ట్.. తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షాలు

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో రెడ్ అలర్ట్ అమల్లోకి వచ్చింది. ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, వాగులు, వంకలు ఉప్పొంగడం, రహదారులు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరుతోంది. నీటి మట్టాలు పెరుగుతుండటంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అధికారుల హెచ్చరికలను పాటిస్తూ అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.

Spread the love

Related News

Latest News