•రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి టౌన్ హాల్ వేదిక కావాలి
•జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రతిపక్షం, జులై 31,వనపర్తి ప్రతినిధి: వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో నిర్మించిన టౌన్ హాల్‌ను నెల రోజుల్లో ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ పాత మార్కెట్ యార్డులోని టౌన్ హాల్‌ను సందర్శించి, ఇప్పటివరకు పూర్తయిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.టౌన్ హాల్‌లో సౌండ్ ప్రూఫింగ్ పనులను వచ్చే నెలలోగా పూర్తిచేయాలని, అలాగే భవనం పరిసరాల్లో పచ్చదనం అభివృద్ధి, శుభ్రత నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.ఫర్నిచర్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేసి, నెల రోజుల్లో టౌన్ హాల్‌ను పూర్తిస్థాయిలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి టౌన్ హాల్ వేదిక కావాలని సూచించారు.అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.పాత యూకో బ్యాంకు సమీపంలో, జిల్లా గ్రంథాలయ ఆవరణ పరిసరాల్లో నిర్మించిన డ్రైనేజీ పనులు, సూర్య చంద్ర పాఠశాల రోడ్డులో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను పరిశీలించి వాటి నాణ్యతను తనిఖీ చేశారు.మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.


















