ప్రతిపక్షం, ఆగస్టు 18: దేశంలో నిరుద్యోగం పెరగడానికి ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఒక కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యువతకు విద్యతో పాటు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, వ్యాపార రంగంలో రాణించే సామర్థ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యార్థులకు తమకు నచ్చిన సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు, ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని నేర్చుకుని అందులో రాణించే అవకాశాలు ఉంటాయని వివరించారు. విద్యార్థుల ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ రకాల శిక్షణ, విద్యా మార్గాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
అయితే భారత్‌లోని అనేక విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లకే పరిమితమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. విద్య పూర్తిచేసిన తర్వాత ఉద్యోగానికి అవసరమైన ప్రాయోగిక నైపుణ్యాలు లేకపోవడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఉద్యోగం పొందడమే కాకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం కావడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. విద్యా సంస్థలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, నైపుణ్య శిక్షణను అందిస్తే యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
దేశ యువతకు కేవలం సర్టిఫికెట్ అందించడం కాకుండా.. వాస్తవ ప్రపంచంలో పనిచేసే నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, స్వయం ఉపాధి అవకాశాలను అందించే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.





























