ప్రతిపక్షం, ఆగస్టు 29: మానససరోవర్ యాత్రకు వెళ్తుండగా భారీ వరదల నుంచి త్రుటిలో తప్పించుకున్నామని ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి తల్లి దాసరి శ్రీలక్ష్మిరెడ్డి తెలిపారు. కేవలం టీ తాగేందుకు పది నిమిషాలు ఆగడం వల్లే తమ ప్రాణాలు దక్కాయని చెప్పారు.
“టీ తాగేందుకు పది నిమిషాలు ఆగాం. ఆ తర్వాత క్షణాల్లోనే భారీ వరద వచ్చింది. మా కంటే ముందు వెళ్లిన వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ విషాదకర దృశ్యాలను చూసి మాటలు రావడం లేదు. అయితే మేమంతా క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉంది” అని శ్రీలక్ష్మిరెడ్డి తెలిపారు.
భారీ వరదల కారణంగా మార్గమధ్యలో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆమె వివరించారు. కొద్దిసేపు ఆలస్యంగా వెళ్లడం తమకు అనుకోకుండా ప్రాణరక్షణగా మారిందని చెప్పారు.
కాగా దాసరి శ్రీలక్ష్మిరెడ్డి కుమార్తె రోహిణి సింధూరి కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. మానససరోవర్ యాత్రలో జరిగిన వరద ఘటన నేపథ్యంలో ఆమె కుటుంబం సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకుంది.





























