[t4b-ticker]

హైకోర్టులో హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు ఊరట

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01, హైదరాబాద్‌: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని ఇటీవల సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ తాత్కాలికంగా నిలుపుదల విధించింది.

సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రంగనాథ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలును ప్రస్తుతానికి నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగనాథ్‌ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 3కు వాయిదా వేసింది. అప్పటివరకు సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై స్టే కొనసాగనుంది. తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై హైడ్రా చేపడుతున్న చర్యల నేపథ్యంలో కమిషనర్‌ రంగనాథ్‌ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులతో హైడ్రా పరిపాలనా వ్యవహారాల్లో ప్రస్తుతానికి కొనసాగింపు ఏర్పడింది.

Spread the love

Related News

Latest News