[t4b-ticker]

గణేశ్‌ ఉత్సవాలు స్వచ్ఛందంగా నిర్వహించాలి: పొన్నం ప్రభాకర్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రిగా ఉత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

గణేశ్ మండపాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని, సాధ్యమైనంత వరకు చేనేత కండువాలను వినియోగించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులను కోరినట్లు తెలిపారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా గణేశ్ మండపాల వద్ద కూడా రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రార్థనలు చేయాలని ఉత్సవ సమితికి ప్రభుత్వం తరఫున సూచించినట్లు తెలిపారు.

కోర్టుల ఆదేశాలను గౌరవిస్తూనే పండుగలను నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. భక్తి, సంప్రదాయాలతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై గణేశ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News