[t4b-ticker]

ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంపై ఎంపవర్డ్‌ ఇండియన్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను వారు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదంటూ చేసిన ఆరోపణలు సరైనవి కావని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపు నుంచి పనులు పూర్తయ్యే వరకు అనేక దశల్లో ప్రక్రియ కొనసాగుతుందని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి గత మూడేళ్లలో స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి 627 ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లకు పంపినట్లు బండి సంజయ్‌ తెలిపారు. వీటిలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన 313, హన్మకొండకు 39, జగిత్యాలకు 45, రాజన్న సిరిసిల్లకు 151, సిద్దిపేటకు 79 పనుల ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రతిపాదనల్లో 82.29 శాతం పనులకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆమోదం తెలిపారని, మిగిలిన పనులకు సంబంధించిన మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్‌ కింద కేంద్రం కేటాయించిన మొత్తం రూ.17.50 కోట్లలో రూ.16.47 కోట్ల మేరకు, అంటే సుమారు 94.1 శాతం నిధులకు సంబంధించిన పనులు ఇప్పటికే వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని బండి సంజయ్‌ వెల్లడించారు. కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్లు, హైమాస్ట్‌ దీపాలు, సీసీ రోడ్లు తదితర స్థానిక అవసరాలకు సంబంధించిన పనులకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

తనకు ముందు కరీంనగర్‌ ఎంపీగా పనిచేసిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఐదేళ్ల పదవీకాలంలో వినియోగించకుండా మిగిలిపోయిన సుమారు రూ.2.50 కోట్లను కూడా తాను ఖర్చు చేసినట్లు బండి సంజయ్‌ చెప్పారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందుబాటులో ఉన్న నిధులను స్థానిక అవసరాలకు వినియోగించేందుకు చర్యలు తీసుకున్నానని తెలిపారు.

ఎంపీ ల్యాడ్స్‌ నిధులు స్థానిక సమస్యల పరిష్కారానికి సరిపోవడం లేదని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మొత్తాన్ని ఏటా పెంచాలని ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ల్యాడ్స్‌ నిధులను ఎంపీలు ఖర్చు చేయడం లేదంటూ ఏకపక్షంగా నివేదికలు విడుదల చేయడం సరికాదని అన్నారు.

నిధులు కేటాయించిన వెంటనే పనులు పూర్తయ్యే పరిస్థితి ఉండదని, ముందుగా ఎంపీలు ప్రతిపాదనలు పంపడం, వాటిని జిల్లా కలెక్టర్లు పరిశీలించి ఆమోదించడం, అనంతరం సంబంధిత శాఖల అధికారులు పనులను చేపట్టడం, అమలు చేయడం, చివరకు పనులు పూర్తిచేయడం వంటి అనేక దశలు ఉంటాయని వివరించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలు నిధులు వినియోగించడం లేదని ఆరోపించడం వాస్తవాలను వక్రీకరించడమేనని మండిపడ్డారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ తన నియోజకవర్గానికి కేటాయించిన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్లో దాదాపుగా మిగిలిన మొత్తం లేదని బండి సంజయ్‌ తెలిపారు. అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపించామని, వాటి అమలు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

స్థానిక సమస్యల పరిష్కారం కోసం తనను ఆశ్రయించే ప్రజల విజ్ఞప్తులను నెరవేర్చేందుకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో పాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను కూడా సమీకరిస్తున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనపు వనరులను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.

ఎంపీ ల్యాడ్స్‌ నిధుల విషయంలో ఇకపై వాస్తవాలను దశలవారీగా పరిశీలించి ప్రజల ముందుంచాలని ఎంపవర్డ్‌ ఇండియన్‌ సంస్థను బండి సంజయ్‌ కోరారు. నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, కలెక్టర్ల ఆమోదం, అధికారుల కార్యాచరణ, పనుల అమలు, పూర్తయ్యే దశ వరకు మొత్తం ప్రక్రియను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నివేదికలు రూపొందించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News