[t4b-ticker]

ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులపై కొరడా ఝళిపించాలి

  • ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు
  • ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్

ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 1: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా భద్రతా ప్రమాణాలు పాటించని ఆసుపత్రులను గుర్తించి, నిబంధనల మేరకు సీజ్ చేయాలని కోరారు.కరీంనగర్ జిల్లాలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. ఆసుపత్రులు ప్రజలకు ప్రాణరక్షణ కేంద్రాలుగా ఉండాల్సిందిపోయి, కనీస అగ్నిప్రమాద భద్రతా చర్యలు లేకుండా కొనసాగడం ఆందోళనకరమన్నారు.ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదం జరిగితే రోగులు తమంతట తాము బయటకు వచ్చే పరిస్థితిలో ఉండరని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యాల నిర్లక్ష్యానికి అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఫైర్ సేఫ్టీ అనేది కేవలం కాగితాలపై ఉండే ధ్రువపత్రం కాదని, అది నేరుగా ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆసుపత్రిలో ఫైర్ ఎన్‌ఓసీ, అగ్నిమాపక పరికరాల పనితీరు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, మెట్ల మార్గాలు, విద్యుత్ భద్రత, ఇతర అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను పరిశీలించాలని కోరారు.నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులకు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని యుగంధర్ అన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రత్యక్షంగా ముప్పు ఉన్న ఆసుపత్రులపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అవసరమైతే సీజ్ చేసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తనిఖీలను పారదర్శకంగా నిర్వహించి, నిబంధనలు పాటిస్తున్న ఆసుపత్రులు, ఉల్లంఘిస్తున్న ఆసుపత్రుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం సరికాదని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించే యాజమాన్యాలపై బాధ్యత నిర్ణయించి కఠిన చర్యలు తీసుకోవాలని యుగంధర్ స్పష్టం చేశారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వాజి తిరుపతి, నాయకులు మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News