*పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్సార్ .
*బ్రాహ్మణ వెల్లంలలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు .
*ఉదయసముద్రం ప్రాజెక్టు తెచ్చింది వైఎస్సార్ – పూర్తి చేసింది కాంగ్రెస్.
*రైతులకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది వైఎస్సార్ .
*ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత వైఎస్సార్ దే .
*మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెలగొడతాం అంటే ఊరుకోం – రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
*మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రతి పక్షం బ్రాహ్మణ వెల్లంల/మునుగోడు సెప్టెంబర్ 02: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు.తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంల లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ అభిమానులు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నాయకుడు అంటే ఎలా ఉండాలి, పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి అనే స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని అన్నారు. ఈ రోజు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే అది ఆయన పుణ్యమేనని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత వైఎస్సార్ దేనని కొనియాడారు. రైతులకు ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది వైఎస్సార్ అని, పేద ప్రజల కోసం, రైతుల కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదని అన్నారు.
ఈ ప్రాంత కరువు, ఫ్లోరైడ్ ను తరిమికొట్టడానికి ఉదయసముద్రం ప్రాజెక్టు తెచ్చిన ఘనత ఆయనదేనని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చామని తెలిపారు.రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పని చేస్తామని, ఆయన మాట ఇస్తే మడమ తిప్పడని ఎలా ఉన్నారో, తాము కూడా అలానే ఉన్నామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదేనని, కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెలగొడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమేనని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ల తరపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.


































