అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత
ఒక్కసారిగా శోకంలో మునిగిన సింగరేణి
సింగరేణి అనేక ఉద్యమాలకు చుక్కాని
పీడిత ప్రజల కలం యోధుడు మునీర్
సామాజిక చింతనాపరుడు, ఉద్యమకారుడు
విద్యార్థి దశ నుంచే పేదల కోసం పోరాటం
జర్నలిస్టుగా వేలాది సామాజిక రచనలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర
ప్రతిపక్షం ప్రతినిధి, మంచిర్యాల, మే 24: సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ (69) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మునీర్ అంటే తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. మందమర్రిలో దొరల దురహంకారానికి వ్యతిరేకంగా విద్యార్థి దశలోనే పోరాడిన పోరాటయోధుడు. సీపీఐ పార్టీలో దివంగత కార్మిక నేత వీటి అబ్రహం తో కలిసి పని చేశారు. శ్రీపతిరావు హత్య కేసులో జైలుకు వెళ్లి కొన్ని సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించారు. ఈనాడు దినపత్రికలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. నిరంతరం ప్రజా సమస్యలపై తన కలానికి బలంగా పని చెప్పేవారు. ‘ఆదరువు’ దినపత్రికలో ‘బండ కింద బతుకులు’ అనే శీర్షిక సంవత్సరకాలం రాసిన జర్నలిస్టుగా కార్మిక లోకంలో మునీరుది ప్రత్యేక స్థానం. అన్ని సామాజిక అంశాలను తట్టి లేపి వార్తా కథనాలను అందించడంలో కూడా ఆయనది ప్రత్యేక స్థానం. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. మందమర్రి తో మునీరుకు విడదీయలేని అనుబంధం ఉంది. నేటి తరం జర్నలిస్టులకు ఆయన ఓ దిక్సూచి మార్గదర్శకుడు. అక్షర శిల్పి కి ఆఖరి వీడ్కోలు. ఆయన మృతి పట్ల ఆయా జర్నలిస్ట్ సంఘాలు ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించాయి. సింగరేణి శోకసంద్రంలో మునిగిపోయింది.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మునీర్ కీలక పాత్ర పోషించారు. సింగరేణి జేఏసీ చైర్మన్ గా పనిచేశారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, సింగరేణి పట్ల అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. సింగరేణివ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సభలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సింగరేణి మనుగడ సాధ్యమని పదే పదే ప్రస్తావించారు. సమైక్య పాలనలో సింగరేణికి జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో కూడా వివరించారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంతో కలిసి అనేక కార్యక్రమాలు పాలుపంచుకున్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం కూడా వహించారు. తెలంగాణను తట్టి లేపిన ‘సకల జనుల సమ్మె’లో సింగరేణి కార్మికులకు నేతృత్వం వహించారు. నాలుగు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా ఆయా పత్రికలలో పని చేసిన ఆయన ఎవరి నుండి కూడా విమర్శలు ఎదుర్కోలేదు. అన్ని పార్టీల వారు మునీరుకు ప్రత్యేక స్థానం కల్పించేవారు. ఆయా జర్నలిస్టు సంఘాలలో పనిచేసిన ఆయన జర్నలిస్టుల హక్కుల కోసం కూడా పోరాడారు. బెల్లంపల్లిలో జన్మించి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి మందమర్రిలో సింగరేణి కార్మికునిగా ప్రస్థానం ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం పలుమార్లు మునీరును బదిలీ చేసింది. సింగరేణి యాజమాన్యం వేధింపులకు నిరసనగా, జర్నలిస్టుగా ఉండేందుకు 2008లో ఉద్యోగ విరమణ చేశారు. మునీరుకు భార్య, ముగ్గురు కుమార్తెలు. కుమారుడు ఉన్నారు.