ప్రతిపక్షం, జూన్ 19: ప్రధానమంత్రి వికసిత భారత్ ఉపాధి ప్రోత్సాహక పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ నిధుల విడుదల చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ పథకం ద్వారా తొలిసారిగా ఉద్యోగంలో చేరి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నారు. అర్హులైన ఉద్యోగులకు నెల వేతనంగా గరిష్ఠంగా రూ.15,000 వరకు, వారిని నియమించుకున్న సంస్థలకు ప్రతి ఉద్యోగిపై రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు.
2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కొత్తగా కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తించనుంది. ఉద్యోగులకు అందే ఆర్థిక సహాయం రెండు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, యువతను ఉద్యోగ రంగంలోకి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతో పాటు పరిశ్రమలు, సంస్థలు మరింత మంది యువతకు ఉపాధి కల్పించేలా ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

















