ప్రతిపక్షం, జూన్ 20: నీట్ రీటెస్ట్ నిర్వహణలో మరోసారి నిర్లక్ష్యం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి పరీక్షా కేంద్రాన్ని ఏకంగా విదేశంలోని అబుదాబిలో కేటాయించడం కలకలం రేపింది. అడ్మిట్ కార్డులో ఈ వివరాలు చూసిన విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
విద్యార్థి అబ్దుల్ మహమ్మద్ తాలిబ్‌కు విడుదల చేసిన హాల్‌టికెట్‌లో పరీక్షా కేంద్రంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి నగరాన్ని పేర్కొన్నారు. తన వద్ద పాస్‌పోర్ట్ కూడా లేదని, ఇంత తక్కువ సమయంలో విదేశానికి ఎలా వెళ్లగలనని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి.
విషయం వెలుగులోకి రావడంతో జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ వెంటనే స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా పరీక్షా కేంద్రం తప్పుగా కేటాయించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం లోపాన్ని సరిచేసి విద్యార్థికి నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని మళ్లీ కేటాయించినట్లు వెల్లడించింది.
ఈ ఘటనతో పరీక్షల నిర్వహణలో మరింత జాగ్రత్త అవసరమని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

















