ప్రతిపక్షం, జూన్ 27: గాజా, ఇరాన్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గాజాలో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటించడం నైతికంగా మాత్రమే కాకుండా జాతీయ ప్రయోజనాల పరంగానూ సమర్థించదగినది కాదన్నారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనను చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన సోనియా, ఈ వైఖరి వల్ల భారత్ మధ్యవర్తిత్వ పాత్ర బలహీనపడిందని వ్యాఖ్యానించారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు దౌత్యపరమైన అవకాశాలు కల్పించిన పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. విదేశాంగ విధానంలో సమతుల్యత పాటిస్తూ జాతీయ ప్రయోజనాలను కాపాడేలా కేంద్రం వ్యవహరించాలని సోనియా గాంధీ సూచించారు.

















