ప్రతిపక్షం, జూన్ 29: అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 135వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఇచ్చిన పిలుపుకు ప్రజలు విశేషంగా స్పందించారని తెలిపారు.
యుద్ధ పరిస్థితుల సమయంలో బంగారం కొనుగోళ్లు తగ్గించడం, విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం వంటి సూచనలను ప్రజలు పాటించడం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్న చిన్న చర్యల ద్వారా కూడా దేశానికి పెద్ద సహకారం అందించవచ్చని భారతీయులు నిరూపించారని అన్నారు. అలాగే, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

















