•హస్తంలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘా రెడ్డి మధ్య రాజుకున్న చిచ్చు
•పార్టీ సొంత నేతల వివాదాస్పద వ్యాఖ్యలు
•వనపర్తి కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత సవాళ్లు
•ఢిల్లీలో అధిష్ఠానానికి మేఘారెడ్డి ఫిర్యాదు.. గాంధీభవన్‌లో చిన్నారెడ్డి వివరణ
•ఎన్నికల రెండేళ్ల ముందే హస్తం పార్టీలో లుకలుకలు.
•బహిరంగ వ్యాఖ్యలతో అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు
•వివాస్పద వ్యాఖ్యలపై చిన్నారెడ్డిపై వేటు పడనుందా?
వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 22 (ప్రతిపక్షం): అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షాల కంటే సొంత నేతల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలు, పార్టీ వ్యవహారశైలి, ఎన్నికల ముందు సీట్ల కేటాయింపు ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం వంటి అంశాలపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌లో అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని, పార్టీ–ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని పెంచాలని సూచించినట్లు తెలిసింది.
రేవంత్‌ను టార్గెట్ చేస్తున్న సొంత నేతలు..
కాంగ్రెస్‌లో అసంతృప్తి స్వరాలు కొత్తవి కాకపోయినా.. ఇటీవల అవి బహిరంగ విమర్శల స్థాయికి చేరడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ వ్యవహారాలపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.అలాగే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆమె స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు డబ్బులకు అమ్ముడు పోయి టికెట్ ఇచ్చారని చిన్నా రెడ్డి వ్యాఖ్యానించారు.దీంతో చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో మేఘారెడ్డి..గాంధీ భవన్ లో చిన్నారెడ్డి!
కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని తూడి మేఘారెడ్డికి ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు పార్టీలో దూమారం రేపుతున్నాయి.చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. శనివారం ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించారు.మరోవైపు తను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన వాట్సాప్ నోటీసులపై చిన్నారెడ్డి స్పందించారు.శనివారం స్వయంగా గాంధీభవన్‌కు వచ్చి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్‌మోహన్‌కు వివరణ ఇచ్చారు.
నిన్న చిన్నారెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు గాంధీభవన్ ఎదుట ధర్నా చేశారు.వనపర్తి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చిన్నారెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను కాపాడాలి’, ‘చిన్నారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు.ఈ వ్యవహారం ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికే పరిమితం కాకుండా పార్టీ స్థానానికి చేరింది.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో కార్యకర్తల్లోనూ విభజన ఏర్పడుతోందన్న చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్‌కు లాభమా?
కాంగ్రెస్‌లో ఈ అంతర్గత పరిణామాలను బీఆర్ఎస్ సహజంగానే రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అంతర్గత అసంతృప్తి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ బలహీనపడుతోందని ఇప్పుడే తేల్చేయడం తొందరపాటు అవుతుంది.2026లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించిందని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.అయినప్పటికీ అధికార పార్టీకి సొంత నేతల నుంచే వరుసగా అసంతృప్తి స్వరాలు వినిపించడం మాత్రం రాజకీయంగా హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది.
అసలు సవాల్ ముందుంది..
ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడం అధికార పార్టీలకు సహజం. కానీ సొంత ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మంత్రుల కుటుంబ సభ్యుల నుంచే బహిరంగ విమర్శలు రావడం మాత్రం నాయకత్వానికి అసలు పరీక్ష. పరకాల, వనపర్తి, మునుగోడు, తుంగతుర్తి వంటి నియోజకవర్గాల్లో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు వేర్వేరు కారణాలతో ఉన్నప్పటికీ.. అవన్నీ కలిపి చూస్తే పార్టీలో సమన్వయం అవసరం ఎంత ఉందో స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాత్రం సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ–ప్రభుత్వం మధ్య సమన్వయం బాగానే ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటి విభేదాలను చక్కదిద్దుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది.అయితే అసంతృప్తి స్వరాలు ఇలాగే కొనసాగి, ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు బహిరంగమైతే మాత్రం దాని ప్రభావం ఎన్నికల నాటికి పార్టీపై పడే అవకాశముంది.అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న ప్రశ్న ఒక్కటే.. సొంత ఇంటి గొడవలను సర్దుకుని ఐక్యంగా ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేక అంతర్గత పోరే ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారుతుందా? రాజకీయాల్లో రాబోయే రోజుల్లో దీనిపైనే ఆసక్తి నెలకొంది.
1:వివాదాస్పద వ్యాఖ్యల్లో మంత్రి. కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు. చిన్నా రెడ్డి

2:మల్లికార్జున్ ఖర్గేకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాయకులు

3:క్రమ శిక్షణ కమిటీ వైస్ చైర్మన్ కు వివరణ ఇచ్చిన చిన్నా రెడ్డి






























